వడ్డించని విస్తళ్ళ కథ..
అవును.. నేను సరిగ్గానే వ్రాసేను. మీరూ సరిగ్గానే
చదివారు. ఇది వడ్డించిన విస్తళ్ల కథ కాదు. వడ్డించని విస్తళ్ల కథే. జీవితంలో ఏ పనీ చేయక
పోయినా కాలు మీద కాలేసుకుని కూర్చున్నా హాయిగా సాగి పోయే వారి జీవితాన్ని “నీకేం
రా, వడ్డించిన విస్తరి నీ జీవిత”మంటూ సరి
పోలుస్తాము. ఎందు చేతంటే ఎంత డబ్బున్న వారికైనా బాగా ఆకలి వేసిన సమయంలో వారికి
ఇష్టమైన పదార్థాలు వడ్డించిన విస్తరి దొరకడం కంటె మించిన అదృష్టం జీవితంలో
మరొకటుండబోదు. మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడో పొరుగూరిలోనో వేళ కాని వేళలోనో ఆకలేసినప్పుడు మన జేబునిండా
డబ్బులున్నా కడుపునిండే అదృష్టం లభించదు.ముళ్లపూడి వారి కోతి కొమ్మచ్చిలో ఒక ఉదంతం
చెప్పారు. ఓ రోజు ఉదయాన్నే ఏలూరునుంచో
ఎక్కడనుంచో సాయంత్రంలోగా మద్రాసు
చేరుకోవాలని వారూ బాపూ గారూ మరోఫిలిం
ప్రొడ్యూసరు మిత్రులూ కలిసి కారులో బయల్దేరారట.మందు బందోబస్తు చేసుకున్నా విందు
సంగతి మరచిపోవడంతో సగం దారిలో కడుపులో నకనకలు ప్రారంభమైతే ఏమీ దొరకక పోతే దారిలో
పొలం గట్టున కూలివారి కోసం కుండలో వండుకుంటున్న అన్నం వారినడిగి పెట్టించుకుని
తిన్న వైనాన్ని హృద్యంగా వర్ణించారు.వారికేం లేదా పోదా? కాని ఆ
సమయంలో వారికి ఆ కూడే అమృతప్రాయమయ్యిందికదా?
అందుచేతనే అదృష్టవంతుల జీవితాన్ని వడ్డించిన విస్తరితో పోల్చడం.ఇది అలాంటి
వడ్డించిన విస్తళ్ల కథ కాదు.
భోగ భాగ్యాలతో తులతూగే మహా
రాజులైతే రోజూ బంగారు పళ్ళేలలో భోజనం చేస్తారు. సిరి సంపదలు కలిగిన శ్రీమంతులైతే
వెండి కంచాలలో భోజనం చేస్తారు. మరి మామూలు మనుషులకి ఇప్పుడైతే స్టెయిన్ లెస్ స్టీలు
కంచాలంటూ వచ్చాయి కానీ పూర్వం రోజుల్లో ఏ ఆకులో విస్తళ్లో గతి.ఎవరో తిన్న (బాగా
కడిగినవే అయినా సరే) కంచాల కంటె పరిశుభ్రమైన ఆకులలో భోజనమే శ్రేయస్కరం. అయిన
వారికి ఆకుల్లోనీ కానివారికి కంచాల్లోనీ అనే సామెత ఊరికే వచ్చిందా. అరిటాకులలో
భోజనం అన్నివిధాలా మంచిదే కానీ అవి అన్ని వేళలా అన్ని చోట్లా కావలసినన్ని
దొరకవుకదా. అందుకనే ఆయాప్రాంతాలలో దొరికే మర్రాకులతోనో బాదం ఆకులతోనో మోదుగ
ఆకులతోనో విస్తళ్లుకుట్టుకుని వాటిలో భోజనం చేసేవారు.
తన ప్రజల మనిషి ఆనే నవలలో శ్రీ వట్టికోట ఆళ్వారు
స్వామి ఊరి దొరల గడీనుంచి ఊళ్లో ఉండే వైష్ణవ కుటుంబానికి ఆకులు కుట్టి
పంపించాల్సిందిగా ఆజ్ఞ రావడం, ఆకుటుంబ యజమాని గ్రామాంతరంలో ఉండడంతో ఆ యింటి
ఇల్లాలు తన చిన్ని కుమారుణ్ణి పంపించి మోదుగాకులు కోయించి తెప్పించి కుట్టి
పంపించడం గురించి వ్రాసేరు. తమ గ్రామాల్లో నివసించే ప్రజలమీద దొరలు ఆరోజుల్లో
చలాయించే దాష్టీకం అలా ఉండేది.
తన చిన్న
తనపు రోజుల్లో, దినమ్మూ పొద్దుటి పూట, రెండుపూట్లకూ సరిపడే ఆకులు కుట్టి
వుంచుకోవడం వైదిక కుటుంబాలలో వొక విధిగా ఉండేదని వ్రాస్తారు శ్రీ శ్రీ పాద సుబ్రహ్మణ్య
శాస్త్రిగారు, తన అనుభవాలూ జ్ఞాపకాలూలో. ఆ ముచ్చట్లు చెబుతూ వారి పెరట్లో అరటి
చెట్లుండేవి గాని వాటి ఆకులు ఆటేవిగావని (సరిపోయేవిగావని)
అందువల్ల తామరాకులో మోదుగాకులో మర్రిఆకులో అరిటాకులో కట్టల కొద్దీ తెస్తూ ఉండడం తన
బాధ్యతగా ఉండేదని, తేవడమే కాదు అవసరమైన ఆకుల్ని కుట్టడం కూడా తన బాధ్యతగా ఉండేదని
వ్రాసేరు.వారి నాన్న గారు ఊరిలో ఉంటే వారే ఎక్కువగా కుట్టే వారనీ వారు కుడితే,
చేత్తో కాదు మిషను మీద కుట్టినట్లు ఉండేదంటారు.అంత చక్కని కుట్టు విజయనగరం
పార్వతీపురం ప్రాంతం నుండి వచ్చేఅడ్డాకు విస్తళ్లలో తప్ప మరెక్కడా తాను చూడలేదనీ
వ్రాసేరు.
శాస్త్రిగారు ఆంతగా ప్రశంసించిన అడ్డాకు విస్తళ్ల
ప్రసక్తి వచ్చింది గనుక ఆ ముచ్చటలు కొంచెం విన్నవిస్తాను.
నాచిన్నప్పుడు మా వూళ్లో ( మాది శాస్త్రిగారు
పేర్కొన్న పార్వతీపురమే లెండి) చాలా మంది బ్రాహ్మలు కోమట్ల ఇళ్లల్లో అడ్డాకుల
విస్తళ్లు కుట్టేవారు. బ్రాహ్మలు స్వంత వాడుకకి కుట్టుకుంటే వైశ్యులు ఎక్కువైనవి
అమ్మకానికి పెట్టుకునే వారు. మాచిన్నప్పుడు పిల్లలకి చల్ది అన్నాలు( మా
నాయనమ్మ చల్ది వణ్ణాలనే అనేది) తామరాకుల్లోనే పెట్టేవారు.ఈ తామరాకుల కట్టల్ని అవి
అమ్మకానికి తెచ్చిన స్త్రీలకు సోలెడో తవ్వెడో నూకలిచ్చి కొనేవారు. అవి దొరకని
రోజుల్లో చల్దన్నాలకి జర్మనుసిల్వరు
పళ్లేలే గతి. మధ్యాహ్నం భోజనాలకి మాత్రం తామరాకులు వాడే వారు కాదు. వాటిలో వేడి
అన్నం పెడితే వాసన వస్తుందనో ఏమో మరి.కనీసం 15, 20 మందిమి కలిసి భోజనం చేసేవారం.
అందరికీ అడ్డాకులతో కుట్టిన విస్తళ్లే. ఇవి కొన్నవికాదు. నాచిన్నతనంలో మారైతులు
గ్రామంనుంచి అడ్డాకుల కట్టలు తెచ్చిపడేసేవారు మాయింట్లో.మేమేమో వాటిని పురికొసలతో
తోరణాలుగా కట్టి వరండాలలోనో మిద్దెలమీదో
నీడను గాలికి ఆరేటట్లు కట్టేవారిమి. అలా అవి కొన్నాళ్లు బాగా ఆరి ఎండిపోయిన
తర్వాత వాటిని విడదీసి సాఫుచేసి దొంతులుగా పెట్టి వాటిమీద తిరగలి (విసుర్రాయి)
దిమ్మలో ఏవో బరువులు పెట్టి ఉంచేవారం. ఆవిధంగా అవి బాగా సాఫీగా తయారయేక వాటితో విస్తళ్లు కుట్టడం ఇంట్లో ఆడవారి పని.
వేసవి కాలంలో మధ్యాహ్నాలు భోజనాలయేక మా
ఆడవారంతా ఇంటి వాకిటి వరండాలో చేరి అకులదొంతులు పక్కన పెట్టుకుని కూర్చునే
వారు.ఆకులు కుట్టడానికి ఈన(చీపురు) పుల్లలను గోటితో రెండుగా మధ్యకు చీరి వాడే
వారు. మధ్యలో ఒక చక్కటి ఆకునుంచి దానిచుట్టూ ఆకులను కుట్టేవారు. మళ్లా వాటిచుట్టూ
రెండో వరస ఆకుల్ని కుట్టేవారు.అవి పెద్దగా చక్కగా గుండ్రంగా చూడముచ్చటగా ఉండేవి. ఆ
ఆకుల్లో పులుసు మజ్జిగ లాంటివి వేసుకుని తిన్నా ఒక్కచుక్క కూడా క్రిందికి పోనంత
పకడ్బందీగా కుట్టేవారు. ఈ ఆకులు కుట్టే సమయంలో మా యింటిప్రక్కనే ఉండే మామేనత్తగారి
అత్తగారు ఆకులు కుడుతూ కుడుతూ ఏ స్త్ర్లీల పాటలో పాడేవారు. అవి వినడానకీ
కాలక్షేపానికీ వచ్చిన ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూడా విస్తళ్లుకుట్టడం లో ఓ చెయ్యి
వేసేవారు. ఈ కార్యక్రమం పది పదిహేను
రోజులపాటు నిర్విఘ్నంగా సాగేది. ఏ రోజుకారోజు వాటిని దొంతులుగా పేర్చిపెద్ద
పెద్దకట్టలను మా నాన్నగారు ఓ ప్రక్కగా నున్న వరండాలో వేలాడదీసేవారు.అవసరమైనప్పుడు
దింపుకుని వాడుకోవచ్చని. ఇంట్లో పెళ్లిళ్లయినా సంతర్పణలయినా అవే సరిపోయే వంటే
ఎన్ని కుట్టేవారో ఊహించుకోండి. జరుగుబాటు లేకా విస్తళ్లుకొనుక్కో లేకా చేసిన పనులు
కావివి.ఉద్యోగాలు చేయక పోయినా సంసారాలు నిర్వహించుకోవడంలో ఆ నాటి స్త్రీలు తమవంతు పాత్రని ఎంత
సమర్థవంతంగా పోషించేవారో తెలియజేసే విషయాలివి.
ఈ వ్యాసం ముళ్ళపూడి వారు చెప్పిన ముచ్చటతో
ప్రారంభించేను కనుక వారే చెప్పిన మరో ముచ్చట చెప్పి ముగిస్తాను.రమణ గారి
చిన్నప్పుడే తండ్రిగారు మరణిస్తే బ్రతుకుతెరువు వెతుక్కుంటూ వారి తల్లిగారు రమణనీ
వారి తమ్ముడినీ తీసుకుని మద్రాసు వచ్చి అక్కడ దుర్గాబాయమ్మగారి ఆంధ్రమహిళా సభలో
నెలకి 20 రూపాయలకి చిన్న ఉద్యోగంలో కుదురుకున్నారట.ఒక రోజు వారు భోజనంచేయడానికి
విస్తరాకులు కొనడానకి కిరాణా కొట్టుకెళ్తే అక్కడ షావుకారు కానీకి మూడు
ఆకులిచ్చాడట.( కానీ అంటే రూపాయిలో అరవై నాలుగో వంతు).కానీకి నాలుగాకులిమ్మంటే తనే
కానీకి అయిదాకుల చొప్పున కొంటున్నాననీ వీరికి నాలుగిస్తే తనకు మిగిలేదేముంటుందని
అన్నాడట.ఆ రేటుకి తాము కుట్టిస్తే తీసుకుంటావా అని అడిగితే సరేనన్నాడుట. ఆకులు
షావుకారే సప్లై చేయాలి కనుక కానీకి ఎనిమిది ఆకులు కుట్టి ఇవ్వడానికి ఒప్పందం
కుదిరింది. అలా కొన్నాళ్లు కుట్టి ఇచ్చేక కానీకి పది ఆకులు కుట్టి ఇవ్వాలని
షావుకారు పేచీ పెడితే ఆ తర్వాత ఆపని మానుకున్నామని రమణ గారు వ్రాసేరు.కానీకి
ఎనిమిదాకుల చొప్పున 512 ఆకులు కుడితే గాని రూపాయి సంపాదించలేరన్నమాట.ఎంత
కష్టపడ్డారో. ఏం చేస్తారు మరి? అప్పుడు వారి జీవితం వడ్డించిన విస్తరి కాదు,
వడ్డించని విస్తరే కదా?
ఇదీ వడ్డించని విస్తళ్ళ కథ. సెలవు.
9 కామెంట్లు:
హాయి గా హృద్యంగా ఉండండి మీ వర్ణన!
ఎలాగు రాలిపోయే చెట్టు ఆకుల్త్ని విస్తర్లుగా వాడటం, తిన్నాక పారేస్తే అవి ఏ జంతువులో తినడం , లేకపోతే మట్టిగా మారడం..environment friendly+recycling+employment for some people .. చక్కటి జీవన విధానం కదా :-)
వడ్డించని విస్తళ్ళ కథ బాగుందండి .
తెలియని సంగతులు తెలిపారండీ.. కృతజ్ఞతలు :)
మీరు వ్రాసిన టపా చదువుతుంటే, ఆ కాలం ఎంత బావుండేదో స్వచ్ఛంగా.. అయ్యో పోయి పోయి స్టీలు, ప్లాస్టిక్‌ల రోజుల్లో పుట్టానే అనిపిస్తోందండీ.
మాలా కుమార్ గారికీ,కృష్ణ గారికీ, ప్రియ గారికీ కృతజ్ఞతలు. ఈ పోస్టు పెట్టే ముందు ఇది ఎవరికైనా ఆసక్తిదాయకంగా ఉంటుందా అనిపించింది. కానీ చాలా మందే చదివారు. మీరు స్పందించారు కూడా.స్పందనకు ధన్యవాదాలు.
మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనూ ఇలా ఆకులు కుట్టేవాళ్ళు. మధ్యాహ్నాలు ఆ ఆకులు కుట్టడం సరదాగా వుండేది. మీరు చెప్పినట్లుగా ఆకులు తిరగలి కింద పెట్టడం చీపులు పుల్లలు విరవడం లాంటివన్నీ పిల్లలం పోటీలు పడి చేసేవాళ్ళం. కోతల సమయంలో, కుప్ప నూర్పిళ్ళ సమయంలోనూ పొలంలో పనిచేవారందరికీ ఆ అకులలోనే భోజనాలు పెట్టేవాళ్ళు.
జ్యోతిర్మయి గారికి ధన్యవాదాలు.
నమస్కారములు గోపాల కృష్ణ గారూ !
చాలా బాగుంది. " వడ్డించిన విస్తళ్ళ్ళ కధ " నాకు కొంచం తెలుసు ఆ రోజుల్లో " విస్తళ్ళు కుట్టుకుని బ్రతుకు తారు " అని కొందరి గురించి చెప్పు కోవడం . ఇక కానీలు , అర్ధ నాలు , అణాలు , బేడలూ , ఇలా , కొన్ని నాణేల గురించి చిన్న ఊహ. చదువు తుంటే " అలా కళ్ళకు కట్టిన విస్తళ్ళు ,ప్చ్ ! ఇప్పుడు ఆధు నికంగా రక రకాలుగా కనుపిస్తు న్నాయి.మీ రచనలు జ్ఞాపకాల వలయాలతో వెనక్కి చుట్టి వేస్తాయి. అద్భుతం.
ఈ మధ్య మీకు తెలుసుగా తుఫాను కారణంగా పవరు లేక కొన్నాళ్ళు , సిస్టం సరిగా లేక ఇప్పుడూ , ఇబ్బంది వలన మీ రచనలను మిస్స్ అవుతున్నందుకు బాధ గా ఉంది.
గోపాలకృష్ణగారూ, కొంచెం ఆలస్యంగానైనా మీ టపాలన్నీ చదివి ఆస్వాదిస్తున్నాను, అంచేత ఎవరు చదువుతారా అని సందేహపడకండి. నాకు బ్లాగులు పరిచయమైన కొత్తలో ఎంతో మంది మిత్రులకి విన్నవించాను, వారి వారి చిన్నప్పటి విషయాలు రాసి పొందు పరచమని. ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. హరేఫల ఫణిబాబు గారొకరు తన చిన్నప్పటి అనుభవాలు కొన్ని రాశారు. మళ్ళీ గత ఏడాదిగా మీ బ్లాగులో ఈ అనుభవాల కథల పరంపరని బాగా ఆస్వాదిస్తున్నాను.
నారాయణస్వామిగారికి, మీస్పందనకూ ప్రోత్సాహానికీ ధన్యవాదాలు.నలుగురితో పంచుకోవాలనిపించిన విషయం ఏది స్ఫురించినా తప్పకుండా వ్రాస్తాను.నేనుకూడా ఎందరి బ్లాగుల లోనో ఎన్ని విషయాలనో చదివి ఆనందిస్తున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి