10, జనవరి 2013, గురువారం

ససేమిరా..ససేమిరా.. ఏమిటీ ససేమిరా కథ ?


ససేమిరా..కథ..ఏమిటీ ససేమిరా?
ఆ మధ్య వచ్చిన ఒక సినిమాకి టాగ్ లైన్ చిత్రంగా ఉంది. ఆ సినిమా పేరు సీతయ్య. టాగ్ లైన్ ఏమో..ఎవరి మాటా వినడు.. ఈ సినిమా వచ్చేక మా వాళ్ళలో ఎవరైనా మొండిగా ఎవరి మాటా వినని వాడిని వాడో సీతయ్య అనడం ప్రారంభించేము. మరి ఈ సినిమా రాకముందు ఆంధ్ర దేశంలో ఎవరైనా తన మాట తప్ప వేరొకరి మాట వినని వారిని ససేమిరా గాళ్లనే వారు. ఇంతకీ ఈ ససేమిరా ఏమిటి? దీనర్థం ఏమిటి?  ఇది ఎలా వాడుకలోకొచ్చింది? అంటే దీనికి చాలా పెద్ద కథుంది. అది చెబ్తాను. కొంచెం ఓపిగ్గా వినండి మరి.

పూర్వం విశాల అనే నగరాన్ని నందుడనే రాజు పాలిస్తూ ఉండేవాడట. అతని ఏకైక కుమారుని పేరు విజయపాలుడు.అతడు కడు దుర్మార్గుడు. అతడొక నాడు వేటకు పోయి కారడవి లో వేటపందిని తరుముతూ  అలసిపోయి ఒక చెరువు గట్టున  విశ్రమిస్తాడు.ఇంతలో అక్కడికి ఒక బెబ్బులి గాండ్రించుకుంటూ వస్తుంది. అతడి గుర్రం కట్టు తెంచుకుని పారిపోతుంది. అతడు పరుగెత్తి దగ్గర్లోని ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు.అంతకు ముందే ఆ చెట్టు మీద ఒక ఎలుగ్గొడ్డు ఎక్కి కూర్చుంది. కిందికి దిగి పారి పోదా మంటే పెద్దపులి అక్కడే మాటు వేసి కూర్చుంది. భయంతో వణుకుతున్న రాజకుమారుణ్ణి చూసి ఆ ఎలుగ్గొడ్డు ప్రాణ భయంతో తన వద్దకు వచ్చిన వానిని తాను చంపనని అభయమిస్తుంది. రాజకుమారుడు మనసు కుదుటపడిన వాడై, అలసిపోయి ఉన్నాడు కనుక అక్కడే చెట్టు కొమ్మమీదే నిద్ర కుపక్రమిస్తాడు.అతడు పడిపోకుండా ఎలుగ్గొడ్డు కాపలా కాస్తుంటుంది.
చెట్టు కింద నున్నపులి  రాజకుమారుడు నిద్ర పోవడం చూసి, ఎలుగ్గొడ్డుతో మనం మనుష్యులను నమ్మ వచ్చా అందులోనూ  ఈ మనిషి మహా మోసగాడులా ఉన్నాడు.ఎంతైనా మనం మనం ఒకటి. ఈ అడవిలో పుట్టి పెరిగిన వాళ్లం. కలసి బతకాల్సిన వాళ్లం. అతడ్ని కిందికి తోసేయి. చంపి చెరిసగం పంచుకు తిందాంఅన్నాది.ఎలుగ్గొడ్డు దానికి ఒప్పుకోక పోవడంతో పులి అలాగే చెట్టుకిందే తిష్ట వేసి కూర్చుంది.
కాసేపటికి రాజకుమారుడికి తెలివి వచ్చింది.ఎలుగ్గొడ్డుకి రాజకుమారుని మనసు పరీక్షించాలని బుధ్ధి పుడుతుంది. రాజకుమారుడితో ఇంతసేపు నేను నీకు కాపలా కాసేను. ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది.నీ తొడమీద కాసేపు విశ్రమిస్తాను అంటుంది.రాజకుమారుడు సరేనంటాడు.ఎలుగ్గొడ్డు అతడి ఒళ్లో తల పెట్టుకుని నిద్ర నటిస్తుంది. ఇది చూసిన పులి అతడితో ఎలుగ్గొడ్డుని ఎవరైనా నమ్ముతారా.. అది నేను వెళ్లి పోయిన తర్వాత నిన్ను చంపి తింటుంది.నా మాట వినిదానిని కిందకు తోసేయి. దానిని చంపి తినేసి నేను వెళ్లి పోతాను. ఆ తర్వాత నువ్వూ  హాయిగా వెళ్ళి పోవచ్చు అంది. దుర్మార్గుడైన  రాజకుమారుడు విశ్వాసం లేకుండా ఎలుగ్గొడ్డుని కిందకు తోయబోతాడు, కాని నిజంగా నిద్రపోని  ఆ ఎలుగు చెట్టు కొమ్మని పట్టుకుని ఉండడంవల్ల కింద పడకుండా ప్రాణాలు దక్కించుకుంటుంది.ఇంతలో తెల్లవారిపోవడంతో పులి నిరాశతో వెళ్లి పోతుంది. రాజకుమారుడింక తనకు చావుమూడిందనే అనుకుంటాడు, కాని  మంచిదైన ఆ ఎలుగ్గొడ్డు అతనితో నిన్ను చంపను, కానీ నీకు  తగిన శాస్తి జరగాలి. కనుక నీద్రోహ బుధ్ధి జనానికి తెలిసేంత వరకూ పిచ్చి వాడిలా ససేమిరా.. ససేమిరా..” అంటూ ఈ అడవిలో తిరుగుతూనే ఉండు. నీ ద్రోహ బుధ్ధి ఎవరైనా బట్టబయలు చేసి నప్పుడు నీకు శాప విముక్తి కలుగు తుంది.అంటూ శపించి అతనిని వదలి వెళ్లి పోతుంది. విజయపాలుడు ఆ అరణ్యంలోనే ససేమిరా.. ససేమిరా అంటూ పిచ్చి వాడిలా తిరుగుతూ ఉంటాడు.
రాజకుమారుడు వేటకై ఎక్కి వెళ్ళిన గుర్రం తిరిగి వచ్చినా రాజకుమారుడు రాక పోవడంతో కలవర పడ్డ రాజు గారు వానికోసం వెతికించి అడవిలో పిచ్చివానిగా తిరుగు తున్న తన కుమారుణ్ణి నగరానికి తీసుకు వస్తాడు.
ఎన్ని రకాల వైద్యాలు చేయించినా, ఎందరికి చూపించినా రాజకుమారుడు ససేమిరా అంటూ పిచ్చివాడిగానే మిగిలి పోతాడు. అప్పుడు ఆ దేశపు మంత్రిగారికి  ఈపిచ్చిని కుదర్చగల శక్తి వారి రాజగురువైన శారదా తనయునికి మాత్రమే ఉందని చెప్పి, వారిని బ్రతిమాలుతాడు. ఆ రాజగురువు తన దివ్యదృష్టితో అడవిలో జరిగిన దంతా గ్రహించిన వాడై, రాజ సభలో అందరి ముందరా,  ఆ అడవిలో జరిగిన సంఘటనను సూచించే పద్యాలు ఇలా  చదువుతాడు. మొదటి పద్యం-
సజ్జన భావము కల్గు సు
హృజ్జనులను మోసపుచ్చుటది నేరుపె నీ
పజ్జం దొడపై గూర్చిన
యజ్జంతువు జంప జూచుటది పౌరుషమే?
ఈ పద్యం వినగానే రాజకుమారుడు ససేమిరాలో వదిలేసి సేమిరాఅని మాత్రం అంటుంటాడు.
రాజగురువు చదివిన రెండవ పద్యం-
సేతువు దర్శింప మహా
పాతకములు బాసి పోవు, బ్రాణ సఖునకున్
ఘాతుకమతి నొనరించిన
పాతకమే తీర్థ సేవ బాయునె నరునిన్?
ఇది విన్నాక రాజకుమారుడు  సేమిరా లో సే వదిలేసి మిరా అని మాత్రం అంటుండేవాడు.
రాజగురువు చదివిన మూడవ పద్యం-
మిత్రద్రోహి, కృతఘ్నుడు,
ధాత్రీసుర , హేమ తస్కరుడు, సురా
పాత్రీ భూతుడు, నిందా పాత్రులు  వీరెల్ల నరక భవనా వాసుల్.
ఇదీ విన్నాక విజయ పాలుడు రా..రా ..”  అని మాత్రమే  అంటుండే వాడు.
రాజగురువు చదివిన చివరి పద్యం-
రాజేంద్ర  విజయపాలుని
రాజిత శుభ మూర్తి జేయ రతిగల దేనిన్
పూజార్హుల వీరెల్లర
బూజింపు మనూన దాన భోజన విధులన్.
స..సే..మి..రా.. అనే మొదటి అక్షరాలతో ప్రారంభమయ్యే ఈ నాలుగు పద్యాలూ వినగానే రాజకుమారునికి శాపం తొలగి పోయి తన పూర్వస్మృతి కలిగి అరణ్యం లో జరిగినది అందరికీ వివరిస్తాడు. ఈ కథ జక్కన వ్రాసిన విక్రమార్క చరిత్రం లోనిది. అంటే చాలా పాతదన్న మాట.
నేటి యువతరం కోసం, భాష లోని నుడికారం వల్ల కలిగే ప్రయోజనమేమిటో చెప్పి ముగిస్తాను.ఎవరైనా ఒక మొండి మనిషికి ఏదైనా విషయం వివరించి వానిని ఒప్పించి రమ్మని ఎవరినైనా పంపించామనుకోండి. అతడు తిరిగి వచ్చాక ఏం జవాబు చెప్పాడని  అడిగితే  ససేమిరా అంటున్నాడని అంటే,  జరిగిన దేమిటో  ఎన్నో మాటల్లో చెప్పనక్కర లేకుండా మనకి పూర్తి గా అర్థమై పోతుందికదా? భాషకి జీవమైనటువంటి ఇటువంటి నుడులు క్రమేపీ భాషలోంచి జారిపోతుండడం మన దురదృష్టం.
సెలవు.


12 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

guruvu garu,
chinnappudu chadivina katha nu mallee baagaa chepparu.i'll tell this to my son.

అజ్ఞాత చెప్పారు...

ససేమిరా గురించి తెలుసుగాని ఇంత వివరంగా ఇప్పుడే తెలుసుకున్నా.

చాతకం చెప్పారు...

చాలా బాగా వ్రాసారండి. మరి వీళ్ళకి ఎడ్డెం అంటే తెడ్డెం గాళ్ళకి తేడా ఎంటి? ;) ఆ పదానికి మూలం ఏమిటో?
ఈ మధ్య తెలుగు బ్లాగుల్లో ఈ ససేమిరాగాళ్ళ కామెంట్లు ఎక్కువ అయ్యాయి.

అజ్ఞాత చెప్పారు...

chaaalaaa aasaktikaraMgaa uMdi..

అజ్ఞాత చెప్పారు...

చాలా ఆసక్తికరంగా ఉంది..

కమనీయం చెప్పారు...


రాయలవారి రాజనీతిజ్ఞత ఆయనకావ్యంలో ప్రతిఫలింపజేసారు.ఇంక ' ససేమిరా' గురించి;కథ బాగానీ ఉంది కానీంతకీ 'ససేమిరా ' అంటే అర్థం చెప్పలేదు.అది తెలుగు పదం కాదనుకొంటాను.ఉర్దూ పదంలాగ ఉంది.ససేమిరా ఒప్పుకోడు అంటే ఎంతచెప్పినా ఏమి చేసినా ఒప్పుకోడు అనీర్థం వస్తుంది కదా.కాని మీ కథకి ,ససేమిరా కి సంబంధం ఏమిటో బోఢపడలేదు.

రామకృష్ణ చెప్పారు...

అవును కథ బాగుంది .అయితే

1. ససేమిరా ఒప్పుకోక పోవడానికి , ఎలుగుబంటి కథకు లింక్ ఎక్కడ?

2. ఆ ఎలుగుబంటికి ససేమిరా పదాన్ని సృష్టించాల్సిన అవసరమేంటి , ఆ పదం అంతకు ముందే ఉందా , లేక దాని కల్పనా?

3. ఇప్పటికీ ససేమిరా వెనుక ఉన్న అసలు కథేంటో మిస్టరీగానే ఉంది మీరింత కథ చెప్పాక కూడా.

www.apuroopam.blogspot.com చెప్పారు...

కమనీయం గారికి,ససేమిరా కథ జక్కన విక్రమార్క చరిత్రం లోనిదని చెప్పాను కదా. ఇది ఆ కవి గారి కల్పనో లేక తన కాలం నాటికే వాడుకలో ఉన్న కథకు తన కల్పన కొంత జోడించి చేప్పాడో ఈ నాడు మనకు తెలియదు.ఈ కథలో రాజకుమారుడు శాపం కారణంగా ససేమిరా అన్న ముక్క తప్ప వేరేమీ మాట్లాడడు.ఇలాగే ఎవరైనా తానన్న మాట పట్టుక్కేూర్చుని వేరే మాట మాట్లాడని వారికి కూడా వర్తింప జేసి ఉంటారు.ఈ మాట ఒక వ్యక్తి మొండితనాన్ని సూచించేదిగా యావదాంధ్రం లోనూ వాడుకలోకి వచ్చిందంటే, ఈ కథ కూడా అప్పటికే బహుళ ప్రచారంలోకి వచ్చి ఉండాలి. ఇది అన్య దేశ్య మని నేను అనుకోవడం లేదు.భాషాభిజ్ఞులెవరైనా మరింత వివరించగలరేమో?

www.apuroopam.blogspot.com చెప్పారు...

రామకృష్ణ గారికి,మీ సందేహం సరియైనదే.ఈ అనుమానం నాకూ కలుగక పోలేదు. అయినా ససేమిరా గురించి ఉన్న కథ మన సాహిత్యంలో ఇదొక్కటే..దీనికి నాకు తోచిన జవాబు కమనీయం గారికి వివరించాను. చూడండి.కథలో రాజకుమారుడిలా ఒకే మాట పట్టకుని వేళ్లాడే వారికి ఈ మాట వర్తింపజేసి ఉంటారు.నేను నా కథలో చెప్పినట్లు వాడో సీతయ్యరా అంటే కొన్నేళ్లు పోయిన తర్వాత సినిమా గురించి కాని దాని టాగ్ లైన్ గురించి కాని తెలియని వారికి అది బోధ పడదు. కన్యాశుల్కం నాటకంలో ఒక చోట-చతుర్థాంకం-నాల్గో స్థలంలో పూజారి వైసబుపె అని అంటాడు.దీనికి అర్థం వైదీకి బుధ్ది సదా పెడసరం అని అట.ఆ రోజుల్లో నియోగులు వైదీకులనలా వెక్కిరించే వారేమో.ఏమయినా ఇలాంటి విషయాలు మనకు తెలిసిన వారు చెప్పక పోతే ఎన్నటికీ తెలియవు కదా?

అజ్ఞాత చెప్పారు...

తలాతోక లేని కథ. ససేమిరా అనే పదమే ఎందుకు వాడాలో చెప్పలేదు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

అనానిమస్ గారికి,ససేమిరా కథకి తలా తోకా లేవన్నారు.నిజమే తలా తోకాయే కాదు. కాళ్లూ చేతులూ కూడా లేవు.లేకపోతే జంతువులు మాట్లాడడమేమిటి.ఎలుగ్గొడ్డు మనిషికి శాపమివ్వడ మేమిటి.కొన్ని కథలలాగే ఉంటాయి.ఇక్కడ కథ కథనం కాదు కథ లోని నీతి ప్రధానం.జంతువులకుండే పాటి నిజాయితీ కూడా మనుష్యులలో లోపించిందని,తాను చేసిన తప్పు పని బహిరంగ పరచి పశ్చాత్తాప పడ్డప్పుడే విముక్తి అనీ ఈ కథ లోని నీతి.ససేమిరా అనే బదులు ఆ ఎలుగ్గొడ్డు ఇంకేమన్నా అలాగే ఎందుకనాలని మనం అడగవచ్చు. దానికి అంతేమిటి ససేమిరా అన్న పదం తెలుగు నాడంతా వ్యాపించిన పదం. దాని వెనుక ఉన్న కథ ఇది అని తెలియజేయడం మాత్రమే నా ఉద్దేశం.ఈ కథ బాగు లేక పోవడానికో, ఇంకా బాగుండి ఉండవచ్చు కదా అన్నదానికో ఈ కథ చెప్పిన జక్కన గారు మాత్రమే సమాధానం ఇవ్వగలరు. కథ బాగుందని కాదు నేను పరిచయం చేసినది.బహుళ వ్యాప్తిలో ఉన్న ఒక తెలుగు పదం వెనుక ఉన్నదేమిటో నలుగురికీ చెప్పాలని అనిపించింది.

www.apuroopam.blogspot.com చెప్పారు...

జనార్దన శర్మ గారికి-అయోమయం ఏమిటి?మొండిగా తానన్నమాటనే పట్టుకు వేలాడుతున్న వాడిడిన ససేమిరా మనం చెప్పి న మాట విననంటున్నాడంటారు. ఈ కథ జక్కన వ్రాసిన విక్రమార్క చరిత్ర లోనిదని చెప్పాను.ఈ కథకు తలా తకా కాళ్ళూ చేతులూ ఉన్నాయా లేవా అనేది కూడా కాదూ ప్రశ్న. మన సాహిత్యంలో ససేమిరా అన్న పదానికి సంబంధించి చెప్పుకునే కథ ఇది ఒక్కటే.ఈ కథ కూడా శ్రీ తిరుమల రామ చంద్ర గారు మళ్ళీ చెప్పారు.ఎవరికి నచ్చక పోయినా మనం చెయ్యగలిగింది ఏమీ లేదు.