13, జులై 2013, శనివారం

ఒక అరుదైన పుస్తకం-- రాయవాచకం


రాయవాచకమన్న పేరు వినగానే ఎవరికైనా ఇది Royal English Reader లాంటి చిన్న పిల్లలు బడిలో చదువుకునే ఏ తెలుగు వాచకమో అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇది అలాంటి ఆషామాషీ పుస్తకం కాదు. ఏ భాషాభిమానులో భాషాధ్యయనం చేసేవారో తప్ప దీని పేరు కూడా విని ఉండక పోవచ్చు. ఇది చరిత్ర కారులకు బంగారు గని, భాషా వేత్తలకు వజ్రాల ఖని అని పేరొందిన గ్రంథం. గ్రంథమని అంటున్నానే కాని ఇది అరవై పేజీల చిన్ని పుస్తకమే. అయినా ఆంధ్ర వచన వాఙ్మయంలో దీనికొక విశిష్ట స్థానం ఉంది. ఇంతకీ ఇదేమి పుస్తకమో ఎవరు వ్రాసేరో  ఎప్పుడు వ్రాసేరో ఇందులో ఏముందో కొంచెం పరిచయం చేస్తాను.
                                             వాచకం అంటే సమాచారం. ఇది మన శ్రీ కృష్ణ దేవరాయలను గూర్చిన సమాచారాన్ని అందజేస్తుంది కనుక దీనికి రాయవాచకమని పేరు. ఇది వ్రాసిన వాని పేరు మనకు తెలియదు.  అతడు తాను శ్రీ మహా మండలేశ్వర కాశీ విశ్వనాథనాయనయ్య గారి స్థానాపతినని  మాత్రం చెప్పుకున్నాడు. ఈ విశ్వనాథయ్యను మథుర రాజ్యాన్ని క్రీ.శ. 1595 మొదలు 1602 వరకు తన అన్నతో పాటు కలిసి పాలించిన రెండవ కృష్ణప్ప తమ్ముడు విశ్వనాథనాయకునిగా గుర్తించారు. స్థానాపతి అంటే సామంత రాజులూ అమర నాయకూలూ తమ ప్రతినిథిగా తమ  రాజధాని విజయనగరం లో నియమించుకున్న రాజోద్యోగి అన్నమాట. ఇలాగ తనఉద్యోగం పేరు ( Designation ) తో మాత్రమే ఈ రచయిత మన సాహితీ లోకానికి పరిచయం. చాలా తర్జన భర్జనల అనంతరం గ్రంథంలో ఉన్న ఆథారాలను బట్టి ఇది క్రీ.శ. 1592- 1602 మధ్య కాలంలో వ్రాయబడి ఉంటుందని భావిస్తున్నారు.
స్థూలంగా ఈ పుస్తకం కర్ణాటక రాజుల దినచర్యనీ కృష్ణరాయల పట్టాభిషేకాన్నీ ఆయన నిత్యకృత్యాలనీ ఆయన ధనాగారం సైన్యం వంటి వివరాలనీ, ఆయన జైత్రయాత్రకు సంబంధించిన విషయాలనీ తెలుపుతుంది. అయితే ఇది రాయల అనంతరం ఏ అరవై డబ్భై సంవత్సరాల తర్వాతో వ్రాయబడినది కనుక ఈ విషయాలన్నీ రచయితే చెప్పుకున్నట్లు సుజనులు చెప్పగా విని వ్రాసినవి గానే మనం గ్రహించాలి. ఆ కారణంగా ఇతర చారిత్రికాధారాలకూ దీనిలోని విషయాలకూ అక్కడక్కడ కొన్ని వైరుధ్యాలున్నా దీనిని విజయనగర కాలం నాటి రాజుల చరిత్రకు ఉపయుక్త గ్రంథం గానే చరిత్రకారులు పరిగణిస్తారు. పైన చెప్పిన కారణం  వలన పూర్తిగా చరిత్రకారులకేమోగాని భాషాచరిత్రకారులకు మాత్రంఇది నిజంగా గని వంటిదే. దీని లోని భాష గురించి కొంచెం వివరిస్తాను.
ఆది కవి నన్నయ కాలం నుండి కావ్యాంతర్గతంగా అక్కడక్కడా కనిపించడం తప్ప దాదాపు 15వ శతాబ్దం వరకూ స్వతంత్రమైన వచనకావ్యమేదీ వెలువడ లేదు. అప్పుడు కూడా సింహగిరి నరహరి వచనములు శఠకోప విన్నపములు వెంకటేశ్వర వచనములు వంటి మత వేదాంత పరమైనవి పరిమితంగా ఉన్నా వాటిల్లో కూడా  ఏ ఒకటి రెండో తప్ప మిగిలినవన్నీ గ్రాంథిక బాషలో వ్రాసినవే. అందువల్లనే రాయవాచకాన్ని మనం పూర్తిగా వ్యావహారిక భాషలో వ్రాయబడ్డ తొలి వచన రచనగా గుర్తించవచ్చు. రాయవాచకం ఆనాటి వ్యావహారికంలో వ్రాసిన చక్కని వచన గ్రంథం అని పేర్కొన్నారు శ్రీ ఆరుద్ర. రాయవాచకమునందు రచయిత అవలంబించిన శైలి ఆంథ్రము నంద పూర్వమైనది అంటారు శ్రీ కులశేఖర రావుగారు. రాయవాచకంలో రచయిత వాడిన భాష ఆనాటి ద్రావిడ దేశంలో ఉన్న ఆంధ్రుల నిత్యవ్యవహారంలో ఉన్న వాడుక భాష. చిత్రమేమిటంటే, తమిళ దేశం నడిబొడ్డున ఉన్న మధుర నాయక రాజుల కాలానికి  సంబంధించిన రచన అయినా దీనిలో ఒకటి రెండు పదాలు తప్పిస్తే  తమిళ పదాలు గాని దీనిపై ఆ భాషా ప్రభావం కాని కానరావు. మరొక ముఖ్య మైన విషయం ఏమిటంటే రాయవాచక భాష నోటిమాటకూ చేతివ్రాతకూ సామరస్యము కుదిరిన భాష. అంటే ఆనాటి తెలుగు వారు  పదాలను ఎలా ఉచ్చరించారో అలా వ్రాయడం జరిగిందన్నమాట. రాయల కాలంలో రాజకీయ వ్యవహారాలకు సంబంధించినదవడం చేత దీనిలో ఆనాటి రాజకీయుల వ్యవహారాలలో చేరి ప్రాచుర్యంపొందిన ఎన్నో పార్శీ పదాలూ, కొద్దిగా బుడతకీచు పదాలూ కూడా కనిపిస్తాయి. ఇటువంటి పారిభాషిక పదాలు, పాతకాలం నాటి రచనా విధానంలో అతిదీర్ఘమైన వాక్యాలూ ఉండడం వల్ల నేడు మనకిది సులభంగా అర్థం కాక తికమక పెట్టినా పొల్లు మాటలు గాని అక్కరలేని వర్ణనలు గాని లేకుండా ఉండడం వలన అప్పటి మన వ్యావహారిక తెలుగు భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగ పడుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం ముచ్చటిస్తాను.
నేను ఇంతకు ముందు నిండుసున్న అరసున్నల గురించిన పోస్టులో చెప్పినట్లు ఆ నాటికి అరసున్న వాడుకలో లేకపోవడంతో పూర్ణానుస్వారాన్ని పలక వలసిన చోట దాని తర్వాతి హల్లును ద్విత్వంగా వ్రాసేవారు.తర్వాత హల్లును ద్విత్వంగా రాయకపోతే దానిని తేల్చి అరసున్నలా పలకాలన్నమాట. ఉదా. కూర్చుండక అని నేడు మనం వ్రాసే చోట కూర్చుండ్డక అని వ్రాసేవారన్నమాట.ఇలా వ్రాయడం ఈ పుస్తకం నిండా ఎన్నో చోట్ల కనిపిస్తుంది.
పదాదిలో వువూవొవోలు లేవన్నది నేటి మాటయితే ఆరోజుల్లో నిరభ్యంతరంగా వీటిని వాడేవారు. ఉదా. ఉంటిమి అని నేడు వ్రాస్తే నాడు వుంట్టిమి అని వ్రాసేవారు.చిన్నయ సూరి కాదన్నా ఈ కాలంలో కూడా పండితులైనవారు కూడా వుత్తరం, వున్నవి అనీ,ఇ ఏ కి యే అంటూ వ్రాయడం మనం గమనించవచ్చు.
 ఈ రచన ఉచ్చారణ కనుగుణంగా కనిపిస్తుందనడానికి నిదర్శనం చూడండి. నరసింహ అనే పదాన్ని చాలామంది నేటికీ తెలంగాణాలో నరసింహ్మ అనే ఉచ్చరిస్తారు. అలాగే సింహాసనాన్ని సింహ్మాసనం అనడం. దీనిలో ఆ రూపాలే కనపడతాయి.. అలాగే అకారాన్ని ఎకారంగా పలకడం. చలనం అనే పదాన్ని చెలనం అని పలుకుతారు. దీనిలో అదే కనిపిస్తుంది. ఒక అనే పదాన్ని వఖ అని పలికి అలాగే వ్రాసేవారన్నమాట. చేయడాన్ని శాయడం అనేవారు. పల్లెకు పల్ల్య అనీ, వాళ్ళకు అనడానికి వార్లకు అనీ. అలాగే పదం మధ్యలో అచ్చును వ్రాయడం- అయితే కి అఇతే- అని పోయినారు కి పోఇనారు- అనీ వ్రాసేవారు. ఇలా ఎన్నో. దీనిలో నేను గమనించిన మరో విశేషం ఏమిటంటే పలకరించడం అనే పదాన్ని అడగడం చెప్పడం అనే మాటల స్థానంలో వాడడం. ఉదా. శిష్యులతో చెప్పి అనడానికి శిష్యులతో పలకరించి అని వ్రాస్తారు. మరో విశేషం ఏమిటంటే సాష్టాంగపడి అనడానికి అడ్డపడి అనేవారు. ఉదా. రాయలవారి సముఖానికి అడ్డపడి చేతులుకట్టుకుని..ఇత్యాది.ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి.
వ్యావహారిక భాష నిత్యచైతన్య శీలి.ఎన్నో రాజకీయ సాంఘిక కారణాల వలన భాషలో ఎన్నో అన్యభాషా పదాలు చేరుతూ ఉండడం వ్యావహారిక భాష తన రూపు రేఖల్ని మార్చుకుని కొత్త అందాలు సంతరించుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకిష్టమైనా లేకపోయినా ఇది జరిగి పోతూనే ఉంటుంది. ఎవ్వరమూ దానినాపలేము.
పరిమితమైన పరిచయంలో నేనింతకంటే ఎక్కువ చెప్పడానికి తావు లేదుగాని శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి విశేషాలుగానీ ఆనాటి మన తెలుగు వ్యావహారిక బాషా స్వరూపాన్నిగాని తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు మాత్రం తప్పక చదవవలసిన పుస్తకం ఇది.
ఈ పుస్తకాన్నిగ్రంథరూపంలో 1933లో శ్రీ జయంతి రామయ్య పంతులుగారు పరిష్కరించగా ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రికవారు 1933లో ప్రచురించారు. వీరు చేసిన మహోపకారమేమిటంటే ఆ నాటి భాషా స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి వీలుగా ఉన్నదున్నట్లుగానే ప్రచురించారు. దీన్ని మరలా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు డా. సి.వి. రామచంద్ర రావుగారి 55 పేజీల సుదీర్ఘ మైన పీఠికతో 1982 లో ప్రచురించారు. మొత్తం 108 పేజీల ఈ  అరుదైన గ్రంథాన్ని  కేవలం అయిదు రూపాయలకే  అప్పట్లో ఏదో పుస్తక ప్రదర్శనలో  కడపలో నేను కొన్నాను. ఆయితే ఇంత అరుదైన పుస్తకం ఇప్పుడు లభించదేమో అన్నభయం సాహితీప్రియులకు అక్కర లేదు. దీనిని గుంటూరు మిత్ర మండలి ప్రచురణలవారు ఎన్నో చిత్రాలతో ప్రచురించారని దానిని  నేడే  13.7.2013 తేదీన  గుంటూరులో ఆవిష్కరిస్తున్నారని Face Book లో శ్రీ చావా కిరణ్ కుమార్ గారు తెలిపారు. అరుదైన ఈ పుస్తకం  భాషాభిమానులకు మరలా లభ్యమౌతోందని తెలిసి ఆనందంగా ఉంది. అందుకే దీని గురించి ఈ ముచ్చట. సెలవు. 
                                                       ***


7 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

చాలా చాలా సంతోషమండీ. మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు.ఎమ్.ఎ లోనూ, భాషా ప్రవీణ లోనూ సాహిల్యం పేపర్ లో విధిగా రాయవాచకం గురించి ఒక ప్రశ్న ప్రతి ఏడూ ఉండేది. మేం ఎంత వెతికినా రాయవాచకం లభించ లేదు. గురువులు చెప్పిన నోట్సు ఆధారంగా పరీక్షల్లో తోచినది రాసే వాళ్ళం. ఆరుద్ర రాయవాచకం గురించి ఇచ్చిన వివరాలు చదివే వాళ్ళం. అంతే తప్ప ఆ పుస్తకం ఇప్పటికీ నాకు దొరక లేదు. అందుకే మీరిచ్చిన వివరాలు చదివి మహదానంద పడి పోయేను. అయితే మీ టపాలో కేవలం రాయ వాచకంలోని భాషా సంబంధి విషయాల ప్రస్తావనే చేసారు. రాయ వాచకం ఎక్కువగా రాయల వారి దినచర్య అని విన్నాను. ఉదయాన్నే పాలతో నిండిన బంగారు కలశాలతో రాయల వారిని నిిద్దుర లేపడం మొదు వారి దిన చర్య చాలా ఆసక్తికరంగా చెప్పడం జరిగిందంటారు. మీరు మేం పుస్తకం కొనుక్కొనే లోపున ఆ వివరాలు కూడా అందించ గలిగితే ధన్యులం. ఏమయినా ఒక మంచి టపా ఉంచి పుస్తక ప్రియుల మన్ననకు పాత్రులయ్యారు, అభినందనలు.

www.apuroopam.blogspot.com చెప్పారు...

పం.జో. గారి స్పందనకు ధన్యవాదాలు.అసలీ పుస్తకాన్ని పరిచయం చేయాలని ఎప్పణ్ణుంచో అనుకుంటున్నాను.ఇప్పటికి కుదిరింది.భాషా ప్రేమికులకు తప్ప వేరెవ్వరికీ ఈ పుస్తకం ఆసక్తిదాయకంగా ఉండదని నాకు తెలుసు.అందుకే ఈ తాత్సారం.శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడాఇందులో ఉన్నాయి.అయితే మామూలు వాళ్ళు దీనిని చదివి అర్థం చేసుకోవడం కష్టం.కొన్ని విశేషాలని మరో టపాలో పరిచయం చేస్తాను.

రవి చెప్పారు...

మంచి పుస్తకం పరిచయం చేశారు. రాయలకాలం నాటి వాడుకభాష తాలూకు మాటలూ, శబ్దాలూ ప్రస్తుతకాలంలో అనంతపురం జిల్లా లో కల్యాణదుర్గం, మడకశిరా, ఆ చుట్టుపక్కలూ, కడపలో కొన్ని ప్రాంతాల దగ్గరే ఎక్కువగా వినిపించే అవకాశం ఉందని నా అనుకోలు. మీరన్న వుంటిమి, వున్నింటిమి, వుంటా వచ్చినాము, పల్ల్య, రాల్యా (రాలేదు అనడానికి), అడ్డంపడి మొక్కినాడు (సాగిలపడి అనడానికి) ఇంకా వుడ్డ జేరిపోవడం, కూస్తా ఉన్న్యాడు, బీగం చెవి ఇత్యాదులు నేటికీ ఆయా ప్రాంతాలలో వినిపిస్తాయి. వీటి వెనుక కన్నడ భాష ప్రభావం ఉండవచ్చు. రాయల వారు కన్నడరాజ్యరమారమణుడు కూడా కాబట్టి కన్నడ కలిసిన తెలుగు యాస ఆ ప్రాంతాల్లో వాడుకలో ఉండవచ్చనిపిస్తుంది. ఎవరైనా ఔత్సాఇకులు పరిశోధిస్తే మంచి టాపిక్ అవుతుందిది.

పుస్తకం చదవాలనిపించేలా పరిచయం చేస్తూ వ్రాశారు. కృతజ్ఞతలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఎన్నో తెలియని మంచి విషయాలను భాషా విసేషాలను తెలియ జెప్పినందులకు కృతజ్ఞతలు

కమనీయం చెప్పారు...



రాయవాచకం గతంలో నేను ఒకసారిచదివాను, కాని ప్రస్తుతం నాదగ్గర ఆ పుస్తకం లేదు.మీరు రాసినట్లు కేవలం అప్పటి తెలుగుభాష,వ్రాత పద్ధతి,మాత్రమే కాదు;అప్పటి దేశపరిస్థితులు,రాజ్యపరిపాలనా,నిర్వహణ గురించి తెలియజేస్తుంది. జోగారావు చెప్పినట్లు అది ప్రధానంగా శ్రీ కృష్ణ దేవరాయలి దినచర్య తెలియజేసే పుస్తకం.ఆయన పొద్దుటినుంచీ ఎలా గడిపేవాడో ,ఎలా పరిపాలించ్చేవాడో వివరంగా తెలియజేస్తుంది.చాలా ముఖ్య్యమైన పుస్తకం.రవిగారు చెప్పినట్లు ఇప్పటికీ అందులోని కొన్ని పదాలు ,వాక్యాలు అనంతపురం జిల్లాలో వాడుకలో ఉన్నాయి.ఈ పుస్తకం ఆంధ్రవిశ్వ విద్యాలయం గ్రంథాలయంలో దొరకవచ్చును.

Unknown చెప్పారు...

శ్రీ గోపాల కృష్ణ గారూ, మంచి పుస్తకం పరిచయం చేసినారు. ధన్యవాదాలు. ఎప్పుడూ వినడమే గానీ చూడలేదూ, చదువలేదు. మొదటి పరిచయంలోనే మొదటి ముద్దగా ఫుల్-మీలే పెట్టించినారు. వొక మరచిపోలేని అనుభూతి.
వెల్లాల హరి హర ప్రసాద్, ప్రొద్దుటూరు, కడప జిల్లా

www.apuroopam.blogspot.com చెప్పారు...

శ్రీ వెల్లాల హరిప్రసాద్ గారికి దన్యవాదాలు. మీవంటి వారు చదివి ఆనందించడమే మా రచలకు సాఫల్యం.