4, ఆగస్టు 2013, ఆదివారం

గుడి లోని రాయిలో శివుడు లేడోయీ...

          
గుడి లోన రాయిలో శివుడు లేడోయీ
ఆడలేనీ శివుని వెదుక బోకోయీ..
బదరినాథము గాని కేదారమున గాని
యమునోత్రి గంగోత్రి ఏడనైనా గాని
గుడిలోని రాయిలో శివుడు లేడోయీ
ఆడనేడను వాని వెదుకబోకోయీ...
చపలకాంతులతోడ చదలనుండెడి గంగ
వెలికొండ వెల్వెడలి వెర్రులెత్తిన గంగ
ఉగ్ర రూపము దాల్చి ఉరికురికి రాగ
తలదాల్చి బంధించ తన చేతగాక
ఓపలేనీ శివుడు ఊరొదిలి పోయాడు.
తన దర్శనము కోరి తరలి వచ్చిన జనము
దిక్కు తోచని వేళ దీనులై భీరులై
త్రాత నీవే యనుచు యనుచు తపియించినా గాని
కావలేకా శివుడు గాయబైనాడు.
              ***
ఆడలేనీ శివుడు ఏడనున్నాడోయీ
ఆర్తులను కావంగ ఆకాశ మార్గాన
అన్నపానముల తెచ్చి ఆదుకున్నా వారి
గుండెలను గుడిగా చేసుకున్నాడోయి.
 అలుపన్నదే లేక  అహరహము శ్రమియించి
ఆర్తులందర గూర్చి ఆ కొండ పైనుండి
ఈవలొడ్డున చేర్చి ఇడుమలను బాపినా
దండు బంటుల గుండె దిటవులో కలడోయి.
                 ***
నీలోన నాలోన మనుజులందరిలోన
చిదాత్మ రూపుడై  చిత్తమందే గలడు
కరుణ గల్గిన గుండె నిండియుంటాడతడు
ఎద తలుపులను తీసి ఎలుగెత్తి పిలిచితే
లోపలుండే శివుడు ఓ యనుచు పలుకు
పూలదండలు వేసి పూజింప పని లేదు
పంచాక్షరీ మంత్ర పఠన మక్కర లేదు
అభిషేక జలములతొ అసలు పనిలేదు
కాస్తంత కరుణతో గుండె నింపిన చాలు
కరకంఠుడిచటనే కాపురమ్మై నిలచు
సర్వులను ఆతడే  సతతమ్ము కాచు.
గుడిలోని రాయిలో శివుడు లేడోయీ
ఆడనేడను వాని వెదుక బోకోయీ...
                  ***    
ఇది అపురూపం అందిస్తోన్న నూరవ పుష్పం. ఇవాళ స్నేహితుల దినోత్సవమట. ఇన్నాళ్లూ బ్లాగుని ఆదరించిన మిత్రులందరికీ అపురూపం  స్నేహాంజలి ఘటిస్తోంది.  సెలవు.
                  ***7 వ్యాఖ్యలు:

kastephale చెప్పారు...

మిత్ర దినోత్సవ శుభకామనలు. నూరవ పుషపానికి అంజలి. గుడిలోన మాత్రమే శివుడులేడోయీ అంటే ఇంకాబాగుండేదేమో!

Pantula gopala krishna rao చెప్పారు...

మిత్రులు శర్మ గారికి కృతజ్ఞతలు.శివుడు సర్వాంతర్యామి. అందు చేత ఏ రాయిలో నైనా లేకుండా పోడు. మనం కాలితో తొక్కి నడిచే ఇంటి గడప రాయిలో కూడా ఉంటాడు.ఆ కారుణ్య మూర్తిని ఎలా దర్శించాలో ఎలా పూజించాలోచెప్పానంతే.

పంతుల జోగారావు చెప్పారు...

శత పుష్ప విరాజితమై శోభిల్లిన అపురూపంకి నా అభినందనలు. గేయం చాలా బాగా రాసేరు. వెర్రు లెత్తిన గంగమ్మను జటా జూటంలో బంధించ లేక, శివుడు ఊరొదిలి వెళి పోయాడనడం ఒక చక్కని ఉక్తి వైచిత్రి. కరుటణ నిండిన గుండెలలో కరకంఠుడు ఉంటాడని చెప్పడం బావుంది. ఇక్కడ శివుడికి ఉన్న అనేక పర్యాయ పదాలలో ఈ శబ్దాన్నే సార్ధకంగా ఉపయోగించడం ప్రయోగ నిపునతకు నిదర్శనం. ఇక, దండు బంటుల గుండె దిటవులో శివుడు ఉంటాడనడం మన వీరజవానుల సేవానిరతికి హారతులెత్తడమే.

కంద పద్యాలతో మొదలయిన అపురూపం లో ఎంచక్కని టపాలను అందించిన మీరు నూరవ పుష్పంగా గేయం అందించడం ముచ్చటగా ఉంది.

నూరవ సంఖ్య వొక విజయానికి కొండ గుర్తే కానీ కొలబద్ద కాదు. అందు చేత నూటితో బద్దకించ కుండా మీరు మరిన్ని మంచి టపాలు ఎప్పుడూ పెడుతూ ఉండాలని కోరుతున్నాను. శతమానం భవతి.

కమనీయం చెప్పారు...


చి| గోపాల కృష్ణ కు, మొదట నాస్తికత్వాన్ని ప్రబోధిస్తున్నట్లనిపించింది.సర్వాంతర్యామి ఐన ఈశ్వరుడు మానవత్వంతో పరిమళించే మంచి మనసుల్లోను, నిస్వార్థంగా పరులకు సాయంచేసే జవాన్లవంటి వ్యక్తుల్లోను ఉంటాడని ప్రవచించడం బాగుంది. చక్కటి ద్విపదలో, ఉచితమైన పదబంధాలతో రచించిన ఈ కవిత మమ్మల్ని బాగా అలరించింది.అభినందనలతో --రమణారావు.

Sanghamithra చెప్పారు...

మానవ సేవ యే మాధవ సేవ అని ప్రబోధించే మీ కవితా చాలా బాగుంది.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
స్నేహితుల దినోత్సవ సందర్భము గా మంచి కవితను అందించారు అది చదువు తుంటే వెనకటికి జానపదులు
ఉన్నాడయా దేముడున్నా డయా
కన్నులకు కనుపింప కున్నాడయా
చుక్కలను నేల పడ కుండా చూస్తున్నాడు , ఆకాశం విరిగి పడకుండా అదిమి పెట్టాడు, సముద్రం చెలియలి కట్ట దాట కుండా చేసాడు అని పాడిన పాట గుర్తుకు వస్తోంది సరిగా గుర్తు లేదు పాత జ్ఞాపకాల పందిరి మీ నూరవ పుష్పము మరిన్ని సుమ సౌరభాలను విర జిమ్మాలని కోరుతూ . ధన్య వాదములు

సుధ చెప్పారు...

మా తర్వాత ఎంతో లేటుగా పుట్టినా లేటెస్టుగా అందరి అభినందనలు అందుకుంటున్న అపురూపమయిన ఈ మీ మానస పుత్రికకు శతసహస్ర శుభాకాంక్షలు.మీరిలాగే భాష, సాహిత్యాలకు సంబంధించిన అపురూపమయిన విషయాలతో ఆ సరస్వతీమాతకు సహస్రార్చనలు జరపాలని కోరుకుంటున్నాను.
దేవుడు గుడిలో మాత్రమే లేడని మానవత్వం గుండెనిండా నింపుకున్న మనిషుల గుండెలనే కోవెలగా చేసుకు-న్నాడనీ చిన్నప్పుడు మీరు చెప్పిన విషయాన్నే మళ్ళీ ఇన్నేళ్లకి ఇంత అందమైన ద్విపద రూపంలో మరోసారి విన్నాను. చాలా బావుంది.