23, నవంబర్ 2013, శనివారం

ఒక అరుదైన ఫోటోలో మాన్యుడైన సామాన్యుడు

     

ఈ ఫోటో సుమారు 70 సంవత్స రాల క్రిందటిది.  అంత పాత ఫోటోలు మనకు చాలా అరుదు గానే లభిస్తాయి. లభించిన వాటిల్లో కూడా మనుషులను స్పష్టంగా గుర్తు పట్టే విధంగా ఉండేవి చాలా తక్కువ గానే ఉంటాయి. ఇది అటువంటి వాటిల్లో ఒకటి.
ఈ ఫోటో 1940 ప్రాంతాలది. విజయనగరం సంగీత కళాశాలకు సంబంధించినది. 

ఫోటో మధ్యలో కుర్చీలో ఆసీనులై ఉన్నవర్చస్వి శ్రీ పట్రాయని సీతారామశాస్త్రి గారు. వారు ఆ రోజుల్లో  సంగీత కళాశాల లో గాత్ర పండితుని గా పని చేస్తూ ఉండేవారు. ఆయన మధుర గాయకుడే కాకుండా వాగ్గేయకారుడు కూడా. కర్ణాటక సంగీతంలో దిట్ట అయినా, ఆ దాక్షిణాత్య సంగీతపు పోకడలు పోకుండా కొంత స్వతంత్రించి కమ్మటి తెలుగు మాటలు వినిపించేటట్లుగా పాడడం వలన అవి జనరంజకం గా కూడా ఉండేవి. ఉత్తరాంధ్రలో ఆ రోజుల్లో సంగీత కళా మతల్లి కి ఈయన చేసిన సేవల గురించి వివరంగా కావాలంటే  పట్రాయని వారి బ్లాగ్లో  చూడ వచ్చును.
ఇక్కడ ఈ ఫోటోలో గురువు గారికి ఎడమ ప్రక్కన క్రిందన ( ఫోటోలో క్రింద నేల మీద కూర్చున్న వారిలో ఎడమ వైపు నుండి మూడవ వారు  తరువాతి కాలంలో ఆంధ్ర దేశాన్ని తన గాన మాధుర్యంతో ముంచెత్తిన  మహా గాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు). శ్రీ ఘంటసాల గురించి నేనేం చెప్పినా చర్విత చర్వణమే అవుతుంది కనుక దానికి పూనుకోవడం లేదు. కానీ ఈ నాటి విద్యార్థులు, యువత  ఈ ఫోటోని చూసి గ్రహించ వలసిన ముఖ్య విషయమిటంటే - తామెంత ప్రతిభావంతులమైనా ఆ ప్రతిభ రాణించడానికి, విద్యాసముపార్జనకి వినయ విధేయతలతో సద్గురువులను సేవించుకోవడం అంతే ముఖ్యమని తెలుసుకోవాలి. శ్రీ ఘంటసాలకి మధురస్వనం భగవద్దత్తమే ఐనా, తాను పెద్దవాడైన తర్వాత  కీర్తనలు పాడినా లలిత సంగీతం పాడినా ఆంధ్ర దేశాన్ని ఉర్రూత లూగించేటట్లు పాడే ఫణితి తన  గురువు గారి వద్ద నేర్చుకున్నదే. అది వారి వరప్రసాదమే. గురువుల పాదాల చెంత కూర్చోవడానికి  నేటి శిష్యులెవరైనా  సిధ్ధ పడతారా?

ఈ ఇద్దరి ప్రముఖుల గురించి చెప్పడం కాదు ఈ నా పోస్టు ఉద్దేశం. వీరి గురించి ఎక్కడో ఒక చోట అందరూ తెలుసుకునే అవకాశం ఉంది కదా? మరెందుకయ్యా మొదలెట్టావు అంటే వినండి మరి.
ఇంతకు ముందు 2011 అక్టోబరు మాసం లో నేను వ్రాసిన  రెండు గొప్ప కథలు అనే పోస్టులో శ్రీ ద్వారం వెంకట స్వామి నాయుడుగారు  విజయనగరం సంగీత కాలేజీలో పని చేస్తుండగా అప్పటి కింకా కీర్తి ప్రతిష్టలు రాక పోవడం వల్ల  ఎక్కువ గా కచేరీలు చేసే అవకాశం కాని, సరైన గౌరవ పురస్కారాలు అందు కోవడం కాని జరుగని రోజుల్లో, ఆ కాలేజీలో బంట్రోతు (ఇప్పుడు మనం ప్యూన్ అని పిలిచే చిరుద్యోగి) తన స్వంత సంపాదనతో ఒక రామాలయం కట్టించి దానిలో విగ్రహ ప్రతిష్ట చేసిన రోజున, శ్రీ నాయుడు గారి కచేరీ చేయించి వారికి అంతకు ముందెవ్వరూ ఇవ్వని విధంగా 116 రూపాయలిచ్చి సన్మానించి తన రామ భక్తినీ సంగీతాభిమానాన్నీ చాటుకున్న సంగతీ,. ఆ తర్వాత శ్రీ రామ ప్రసాదం గా పాయసాన్ని సేవించి నిద్ర లోనే దైవ సాయుజ్యాన్ని పొందిన శ్రీ రామస్వామి అనే వ్యక్తిని గురించి చదివే ఉంటారు. 

అతి సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ కూడా  రామ భక్తి తోనూ సంగీతజ్ఞుల సేవ లోనూ తరించిన ఆ అసామాన్యుని  ఫోటో మీకూ చూపించే అవకాశం దొరకడమే ఈ పోస్టు వ్రాయడానికి కారణం. 

 పైనున్న ఫోటోలో కుడివైపు చివర వినమ్రంగా చేతులు కట్టుకుని డవాలా ధరించి నిల్చున్న ధన్యజీవి  శ్రీ రామస్వామియే.
                                              ******
(ఇంత మంచి ఫొటోని ఇంత చక్కగా భద్రపరచిన  వయో వృధ్ధులు,  శ్రీ పట్రాయని సంగీతరావుగారు (సీతారామ శాస్త్రి గారి జ్యేష్ఠ కుమారులు- అభినందనీయులు.)
                                              
                                                ****















4 కామెంట్‌లు:

కథా మంజరి చెప్పారు...

మాన్యడైన సామాన్యుని అరుదైన ఫొటోని అందరితో పంచు కున్నందుకు సంతోషం. టపాకి అనుబంధంగా ఇచ్చిన లింకులు టపాకి వన్నె తెచ్చేవిగా ఉన్నాయి.

పాత బంగారాలను భద్ర పరచు కోవడానికి ఒక మెళకువా, అభిరుచీ, గుండెలో తేమా ఉండాలి.

అభినందనలు.

Meraj Fathima చెప్పారు...

ఇలాంటి ఫోటోస్ చూడటం ఓ గొప్ప అనుభూతి.

వోలేటి.జగన్నాధరావు చెప్పారు...

అటువంటి మహాను భావుల ఫోటో చూసి జన్మ ధన్య మైంది.ఆ భాగ్యం కలిగించిన మీకు చాలా ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ప్రముఖుల ఫొటోలు లభించడం నిజంగా అపురూపమె ధన్య వాదములు