20, జనవరి 2012, శుక్రవారం

ఓ మంచికథ.... రాజుగారి బాకీ కథ...


                      
 అబ్బో ఈ ముచ్చట ఇప్పటిది కాదు. సుమారు వంద సంవత్సరాలక్రితం 1918లో జరిగినది. అప్పుడు శ్రీ శాస్త్రిగారు విద్వాన్ పరీక్ష ప్యాసయి విజయనగరం మహారాజావారి కళాశాలలో తెలుగు పండితునిగా ఉద్యోగంలో చేరిన కొత్త రోజులు. ఒక రోజు వారి ఊరు (కాకినాడకి 20 మైళ్లదూరంలో గోదావరి ఒడ్డున ఉన్న) మసక పల్లి నుంచి ఉత్తరం వచ్చింది. రెండు మూడు రోజులు సెలవు పెట్టి రమ్మని. ఆ ఉత్తరం రాసిన వాడు అతనికి షడ్డకుడు (తోడల్లుడు) అయిన బాల్య స్నేహితుడు. ఏదో అవసరం ఉండి ఉండక పోతే ఉత్తరం రాయడని కాలేజీకి మూడు రోజులు సెలవు పెట్టి శాస్త్రి గారు  వారి ఊరికి వెళ్ళారు. వెళ్లగానే ఏమిటి సంగతని అడిగితే ఆ స్నేహితుడు ఎవరో నరస రాజు గారట, ఈవూరి వారే కాని వూరు వదలి పెట్టి 40 సంవత్సరాలవుతుంది. వారు నీ కేదో బాకీ ఉన్నారని ఆవిషయమై పిలిపించమంటే నీకు రాసేను. రేపు పొద్దున్నే ఆయన వస్తారు”అని చెప్పేడు.
ఈ రాజుగారి కథ ఏమిటంటే  ఆయన ఆ ఉళ్లో బాగా గౌరవంగా బ్రతికిన క్షత్రియకుటుంబంలోని వాడు. కుటుంబం ఆర్థికంగా చితికి పోతే అక్కడి బ్రాహ్మణుల వద్ద చేబదుళ్లు తీసుకుంటూ వ్యవసాయం చేసేవాడు. అది కలిసిరాక అప్పుల పాలయ్యాడు. చేసిన అన్ని అప్పులూ లెక్కచూసుకుంటే వెయ్యి పన్నెండు వందలదాకా తేలాయట.ఇక ఆ ఊళ్లో బ్రతక లేక భద్రాచలం దగ్గర ఎక్కడో ఏజెన్సీ ప్రాంతానికి పోయి అక్కడ బ్రతుకు వెళ్లదీస్తూ ఉన్నాడు.ఒకటి రెండేళ్లలో చిల్లర అప్పులన్నీ తీర్చేసినా ప్రోనోట్లు వ్రాసి తీసుకున్న అప్పులు 380 రూపాయలు తేలాయట. అవి తీర్చే స్తోమత ఆయనకు లేకపోయింది. అవి ముగ్గురు బ్రాహ్మణుల దగ్గర తీసుకున్నమొత్తాలు రూ. 250, 50, 80 కి సంబంధించిన 3 ప్రోనోట్లు. అవి కాలదోషం పట్టే రోజులు సమీపించేసరికి , ఏదో కొంత చెల్లు వేయించి కాలదోషం పట్టకుండా చూద్దామనుకున్నా అప్పు తీసుకున్న రాజుగారు ఎక్కడికో వెళ్లి పోవడం చేత కుదరలేదు. అప్పుడు 250, 50 రూపాయలు అప్పులిచ్చిన ఆసాములు ఆ వూళ్లో లౌక్య వ్యవహారాలు తెలిసిన రమణయ్యగారికి ప్రోనోట్లిచ్చి కాకినాడలో దావాలు వేయించ వలసిందిగా కోరారు. ఆయన ఆవిధంగా దావాలు వేయించిన కొద్ది నెలల్లోనే ఒక సారి ట్రైన్లో రాజుగారికి తారస పడడం జరిగింది. మన ఊరివారు నామీద దావాలు తెచ్చారటగా అని రాజుగారు అడిగేసరికి రమణయ్యగారు  అప్పులిచ్చిన వారు కోరగా తానే దావాలు వేయించినట్లు తెలిపాడు. అప్పుడు రాజుగారు మరి  లింగయ్య శాస్త్రుల ప్రోనోటు విషయంలో దావా తేలేదేమని అడిగితే
రమణయ్యగారు చెప్పినదేమిటంటేతాను ప్రోనోట్లగురించి దావాలు తేవడానికి కాకినాడ వెళ్లేటప్పుడే లింగయ్య శాస్త్రులని కూడా కలిసి ప్రోనోటుగురించి గుర్తు చేసాననీ  కాలదోషం పట్టిపోకుండా అది కూడా ఇస్తే  ఒకే సారి దావాలు వేయవచ్చునని అన్నాననీ కాని దానికి శాస్త్రిగారు రాజుగారి కంఠంలో ప్రాణ ముండగా నోటుకు కాలదోషం పట్టటమేమిటని అన్నారనీ తాను దావా వేయదల్చుకో లేదని చేప్పారనీ.
దావాలు వేసిన వారు రాజుగారి దగ్గర ఏమి వసూలు చేసుకోగలిగారో తెలియదు గాని లింగయ్య శాస్త్రులగారి ప్రోనోటు బాకీ లింగయ్య శాస్త్రులు బ్రతికుండగా కాని, వారి కుమారుని జీవిత కాలంలో కాని తీరనే లేదు.అసలా ప్రోనోటు ఉందో లేదో ఉంటే ఎక్కడుందో కూడా ఎవ్వరికీ తెలీదు. ఉన్నా ఎప్పుడో కాలదోషం పట్టే ఉంటుంది కదా?  రాజు గారికిప్పుడు 70 ఏళ్లు. తన 30 వ ఏట తీసుకున్న బాకీ ఇది. దానిగురించి మాట్లాడడానికే ఇప్పుడు రాజుగారు వస్తున్నది.
                  మరునాడు ఉదయమే శాస్త్రిగారు వారి దగ్గర బంధువులూ వీధి అరుగు మీద కూర్చుని ఉండగా రాజు గారు వచ్చేరు. కుశల ప్రశ్న లయేక రాజుగారు ఇలాఅన్నారు:
అయ్యా మీతాతగారు లింగయ్యశాస్త్రులుగారూ నేనూ మంచి స్నేహితులం. అవసరమై రెండు సార్లు నలభై రూపాయల చొప్పున మొత్తం ఎనభై రూపాయలు మీ తాతగారి వద్ద చేబదులు పుచ్చుకోవడం జరిగింది. తీర్చే అవకాశం లేక 80 రూపాయలకూ ప్రోనోటు వ్రాసి ఇచ్చేను. నోటైతే వ్రాసి ఇచ్చేనుగాని అది తీర్చడానికి మీ తాతగారి జీవిత కాలంలోగాని మీ నాయనగారి జీవిత కాలంలో గాని నాకు వెసులుబాటు కలుగ లేదు. వయసు మీరి పోతోంది కనుక ఋణగ్రస్తుడిగా పోవడం ఇష్టంలేక వారి వారసులకైనా బాకీ తీర్చేద్దామని ఇక్కడ వాకబు చేస్తే తమరు విజయనగరంలో ఉన్నట్టు తెలిసింది. అదైనా విజయనగరం పోస్టుద్వారా పంపించవచ్చుకదా అంటారేమో? ఆప్త మిత్రులైన లింగయ్య శాస్త్రి గారి మనుమలైన మిమ్మల్ని ఓసారి చూసి, ఏ అరుగు మీదైతే అప్పులు తీసుకుని ఋణపత్రం రాసి ఇచ్చేనో అక్కడే దాన్ని తీర్చి ఋణవిముక్తుణ్ణవుదామనిపించి మీకు లేఖ వ్రాయించాను. శ్రమ అనుకోకుండా తమరు వచ్చేరు. నేను తీసుకున్న అప్పు ఇప్పటికి వడ్డీలతో కలిపి ఎన్ని రెట్లో అయిఉంటుంది. తమరు ఎంత ఇమ్మంటారో చెప్తే దాఖలు చేసుకుంటానని అన్నారు. దానికి శాస్త్రిగారు మీకెంత తోస్తే అంత ఇవ్వండి. నేను ఎక్కువ తక్కువ అనకుండా తీసుకుంటాను అని అన్నారు. రాజుగారు అలా కాదని, శాస్త్రిగారు చెప్పిన మొత్తం ఇచ్చినప్పుడే తాను ఋణవిముక్తుడనౌతానని అన్నారు. వెంటనే శాస్త్రిగారు అయ్యా మీరు మా తాతగారి వద్ద తీసుకున్న ఎనభై రూపాయలూ ఇవ్వండి. చాలు.మీరు ఋణ విముక్తులైనట్లే భావిచండిఅన్నారు.
రాజుగారు పై మీది కండువాలో కట్టిన మూట ముడి విప్పి  తాను తెచ్చిన వెండిరూపాయలు అక్కడ దొంతులుగా పెట్టి స్వీకరించండి అన్నారు. అవి సరిగ్గా 80 రూపాయలే ఉన్నాయి.
శాస్త్రిగారు వాటిని స్వీకరించడంతో రాజుగారు ఋణ విముక్తులయ్యారు.
                                                    *****
అయ్యా, ఇదీ కథ. ఇది నిజంగా జరిగిన కథ. దీనిలో రాజుగారి పూర్తి పేరు శ్రీ కాకర్లపూడి నరసరాజుగారు. శాస్త్రిగారు కళా ప్రపూర్ణ శ్రీ దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు. ఈ ఉదంతాన్ని విపులంగా శ్రీ శాస్త్రిగారు తమ స్వీయ చరిత్రలో వ్రాసేరు.
(దానిని శ్రీ రాజాచంద్ర ఫౌండేషన్ 482, శాంతినగర్, కె.టి.రోడ్, తిరుపతి-517507 వారు ప్రచురించేరు. వారికి నా కృతజ్ఞతలు.)
 మాటకి కట్టుబడి ఉండే మహనీయులు ఏ కాలంలోనైనా ఉంటారు. కాకపోతే వారిగురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఈ మంచి కథని మీకందిస్తున్నాను.
మరో సారి మరో మంచి కథతో మీముందుకు వస్తాను. సెలవు.

5 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

నిజంగానే మంచికధండి...

అజ్ఞాత చెప్పారు...

నీతి నిజాయితీలే ఆదర్శంగా బతికిన రోజులవి. మీ కథ చదివి చాలా అనందించేను.

కాముధ

కథా మంజరి చెప్పారు...

చాలా హృద్యమైన చక్కని కథనాన్ని తిరిగి రమ్యంగా చెప్పినందుకు మీకు నా హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియ జేస్తున్నాను . ఇలాంటి కథలు విన్నప్పుడు ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు అనిపిస్తుంది కదా.

అజ్ఞాత చెప్పారు...

ఇది అపురూపమైన కథ. రాజుగారు ఋణవిముక్తులవడానికి కాలదోషంతోపనిలేకుండా, లింగయ్య శాస్త్రిగారి మనుమలకి ఇవ్వజూపడం ఒక రకమైన ఉత్తమ వ్యక్తిత్వమైతే, శాస్త్రిగారు అసలుమాత్రమే ఇవ్వమని కోరడం రాజుగారి వ్యక్తిత్వానికి దీటైన వారి సౌశీల్యానికి మచ్చుతునక. ఇదే కథగా వ్రాసి ఉంటే దానికి ఇంత ఆకర్షణ, credibility ఉండేవి కావేమో నేటి మన అనుభవాల పరంపర దృష్ట్యా. అందుకేనేమో అన్నారు: Truth is stranger than fiction అని. ఇంతచక్కని విషయాన్ని ఎరుకపరచినందుకు
ధన్యవాదాలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆ రోజుల్లో అంతటి మహనీయులు ఉండ బట్టీ ఈ నాడు కొంతైనా ధర్మం నిలిచి ఉంది. చాలా మంచి విషయం " కధ గా " చెప్పారు . చాలా బాగుంది.