ఆ మధ్యని ఏదో పెళ్ళికని విశాఖ పట్నం వెళ్లి అంత దూరం ఎలాగూ వెళ్లేను కనుక చిన్నప్పుడు పుట్టి పెరిగిన మా వురు ఎలాగుందో ఒక సారి చూసి వద్దామని పార్వతీ పురం వెళ్లేను. అక్కడ మేం పుట్టి పెరిగిన పెద్ద ఇల్లూ అవీ ఉండేవి. (ఇప్పుడూ ఉన్నాయి కాని ఇప్పుడవి మావి కావు). మా వాళ్లు కూడా ఎవ్వరూ లేరు. మేనత్త కొడుకు ఒక్కడు మాత్రం ఆ ఊరు విడవకుండా వాళ్ల సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. వాళ్ల ఇంటికే వెళ్లాను. ఎప్పటి నుంచో రమ్మని పిలుస్తున్నాడేమో చాలా ఆనందించేడు. ఊరంతా ఒకసారి చూసి రావాలనే నా కోరికని చెప్పగానే తప్పకుండా చూపిస్తానని అన్నాడు.
ఆ సాయంత్రం వాడి స్కూటరు మీదే బయల్దేరి ముందుగా టౌన్ స్టేషన్ వైపు వెళ్లేము. మా వూరు చిన్న వూరయినా మాచిన్నప్పటినుండి రెండు రైల్వే స్టేషన్లున్నాయి. టౌన్ స్టేషను చాలా చిన్నది. ఇప్పుడంటే బుకింగాఫీసు , ప్లాటుఫారమ్మీద షెడ్డులాంటివి ఉన్నాయి గాని మాచిన్నప్పుడు ఉట్టి ప్లాటుఫారము మాత్రమే ఉండేది. టిక్కట్లమ్మే బుకింగ్ క్లర్కు పాపారావు గారు ట్రెయినొచ్చే గంట ముందర వచ్చి దగ్గర లోని సీతా రామస్వామి కోవిల్లో కూర్చుని టిక్కట్లమ్మి వెళ్లిపోయే వాడు. మా చిన్నప్పుడు మా వూళ్లో అందరికీ సాయంత్రం విహార స్థలం ఆ ఓపెన్ ప్లాట్ ఫారమే. ( ఆ మధ్య నవ్య నీరాజనం శీర్షికలో రచయితల పరిచయాల లో ఇప్పటి ప్రముఖ సినీ దర్శకుడు వంశీ పరిచయంలో ఎడిటర్ జగన్నాథ శర్మ తానూ వంశీ ఆరోజుల్లో ఆ ప్లాట్ ఫారమ్మీద సిమెంటు బెంచీల మీద కూర్చుని కన్న కలలూ కథల డిస్కషన్లగురించి రాసేడు. ) అదిగో ఆ ప్లాట్ఫారమ్మీద కొచ్చేసరికి ఒకబ్బాయి మాకెదురై నమస్కారం చేస్తూ పలకరించేడు. మా బావ అతణ్ణి ఏఁవోయ్ రాఁవి నాయుడూ బాగున్నావా ఏఁవిటిలా వచ్చేవని ఆడిగేడు. “మా అమ్మమ్మకి కళ్లు కొంచం మసకేసాయండి కళ్లడాక్టరుకి ఓపాలి సూపిద్దాఁవని వొయిజాగ్ తీసిగెల్తన్నానండి... ఇయ్యేల బండి గంట లేటట. బండికోసం సూస్తన్నాఁవండి” అన్నాడు.. ఆవిడేదీ అంటే “అదో ఆ బల్లమీద కూకునుంది” అన్నాడు. మా బావ వెంటనే “బావా నువ్వు వెతకబోతున్న తీగ కాలికి తగిలింది. సోఁవులప్పని చూడాలనీ ఆమెతో మాట్లాడాలనీ ఉందని ఆన్నావుకదా?. నువ్వు సోఁవులప్పతో మాట్లాడుతూ ఉండు. నేనిప్పుడే చిన్న రాచకార్యం చక్కబెట్టుకుని అరగంటలో వచ్చేస్తా”నని వెళ్లేడు. నేను రామి నాయుడుతో సోఁవులప్ప కూర్చున్న సిమెంటు బెంచీ వేపు నడిచేను.
( బ్రాహ్మలలో యజ్ఞం చేసిన వారిని సోమయాజులనీ ఆయన భార్యని సోమిదేవమ్మ అనీ ఆంటారు, వారి పేరున వారి పరంపరలో సోమమ్మలూ సోమిదేవమ్మలూ రావడం ఉంది. మరీ నాయురాలికీ పేరెట్లా వచ్చి ఉంటుందనుకుంటే అప్పుడు తట్టింది. మా ఊరికి దగ్గరలో గుంప అనే ఊళ్లో రెండు నదుల సంగమంలో(అవి నాగావళి జంఝావతి అనుకుంటాను. నాకు సరిగా తెలీదు) సోమేశ్వరాలయం ఉంది. అక్కడ శివరాత్రికి పెద్ద తిరుణాల జరుగుతుంది. ఆ సోమేశ్వరుడి పేరిట ఇక్కడి వాళ్లు సోమేశ్వర రావులూ సోమనాథాలూ సోమమ్మలూ చాలామంది ఉన్నారు. అలాగే ఈవిడ తల్లిదండ్రులు ఈవిడపేరు సోమమ్మ అని పెట్టుకుని ఉంటారు. ఈ ప్రాంతంలో అక్కని అప్ప అని గౌరవంగా పిల్చుకుంటారు కనుక ఈవిడ అందరికీ సోఁవప్ప అయిఉంటుంది.)
మేం దగ్గరకి వెళ్లగానే రామి నాయుడు అమ్మమ్మా ఎవురొచ్చేరో సూడు అన్నాడు. కళ్ల మీద చెయ్యి అడ్డం పెట్టుకుని చూస్తూ ఏమో ఎవురో నాకేటేరుక నానెప్పుడూ సూసినట్టు నేదు. పొల్తి పట్నేక పోతన్నాను అంది. ఈన మన పంతులు మేష్ట్రుగారి పెద్దన్నయ్యగారి అబ్బాయి అని చెప్పేడు. “ఎవురు నారానమూర్తిగోరి పెద్దబ్బాయా. అత్తలెక్కడో అయిద్రాబాదులోనో ఎక్కడో ఉండాల గావాల” అంది. “ఎప్పుడొచ్చేవు బావూ?” అని అంది. మా ఆవిడా పిల్లలూ బావున్నారా అనీ అడిగింది. మా అమ్మనీ నాన్ననీ తల్చుకుంది. ఆ ఆప్యాయతకి నాకు కళ్లు చెమర్చేయి. ( నాకావిడ తెలీదు. తెలీదంటే నా చిన్నప్పుడు యాభై యేళ్ల క్రిందట ఆవిడని ఒక్కసారే చూసేను. అంతే. అంతకుమించి తెలీదు. నేనప్పుడు చాలా చిన్నవాణ్ణి. హైస్కూల్లో చదువుకుంటూ ఉండే వాణ్ణి. పొలం నూర్పులకని మా నాన్నగారు ఆ పల్లెకి వెళ్తుంటే ఆయనతో వెళ్లాను. అప్పుడు మారైతు ఫలానా వారి కోడలని మా నాన్నగారికి పరిచయం చేస్తుంటే చూడ్డమే. పసిడిరంగు ఛాయ లేత ముఖం లేడికళ్లూ చాలా సిగ్గుతో అణకువగా నిల్చుంది. నానూ పట్టిడా వేసుకొని, చెవులకిఎత్తు గొలుసులు పెట్టుకొని,బుటాల కోక కట్టుకొని పసుపు రాసిన మొకాన రూపాయికాసంత బొట్టుపెట్టుకోని నాయిరాళ్లందరిలాగే ఉంది.) ఇదిగో మళ్లా ఇప్పుడు చూడ్డమే.. ఇప్పుడేమో బాగా ముసిల్దై పోయింది. పచ్చటి పసిమిరంగు ఒళ్లు కాంతివంతంగానే ఉన్నా ముఖమూ ఒళ్లూ అంతా ముడతలు పడి ఈనెలు తేరిన పండుటాకులా ఉంది. అయినా అనారోగ్యం ఎక్కడా కనబడ్డంలేదు. కళ్లు మసగబారేయంటున్నాడు కనుక కాటరాక్టు వచ్చి ఉండొచ్చు. “మీరు మాట్లాడుతూ ఉండండి. చల్లటి డ్రింక్స్ తీసుకొస్తా”నని చెప్పి నాయుడు బయల్దేరబోయేడు. నేనొద్దన్నా వినకుండా. “ఎల్నీ బావు దగ బెట్తుంది గద. కాతంత తాగితే సల్లబడతావు” అంటూనే “ఒరే నాయిన నువు తాగి పంతులుగారికి తే.. పో.. నాకొద్దు నేన్తాగను. నానీల్లు నాకున్నాయి గావా” అంది.
రామినాయుడటెళ్లగానే నేను తేరుకుని “అంతా బాగున్నామమ్మా. నువ్వెట్లాగున్నావు అని అడిగేను.” “నాకేంటి నోపం బావూ..ఏ ఇబ్బందీ నేదు. బతుకు సుకంగా ఎల్లిపోతోంది” అంది. ఎవర్నైనా పలకరిస్తే చాలు సవాలక్ష ఇబ్బందుల్నివర్ణించడం చూసిన నాకు సోఁవులప్పమాటలు ఆశ్చర్యం కలిగించేయి. సోఁవులప్ప ఈ వయసులో కూడా పల్లెటూళ్లో ఒక్కత్తీ ఉంటోంది. ఎలా రోజులు
గడుస్తున్నాయంటే “నాకేటి కావాల బావూ..రెండు పూట్లకీ రెండు పిడికిళ్లముద్దలు. కట్టుకోనానికో గుడ్డముక్కుంతే సాల్దా” అంది. “ రెండు గేదలున్నాయి. ఆట్ని సాక్కుంటూ పాలు పిండుకోని సెంటరుకి తోల్తాను. ఆ వొచ్చే రాళ్లే నాకు శాన” అంది. “అదీ గాక ఈ మనవడు ఒకట్రెండురోలు సెలవు దొరికినా ఒచ్చి సూసి ఎల్తుంటా”డనీ ఒచ్చినప్పుడల్లా పదో పరకో ఒద్దన్నా ఇనకుండా ఇంట్లో పెట్టి పోతుంటాడనీ చెప్పింది. అప్పుడప్పుడూ “సీరలూ అవీ ఇచ్చి ఎల్తుంటా”డనీ తన కవేవీ అక్కర్లేదు కనక “లేనోల్ల కెవులకేన ఇచ్చేస్తుంటా”ననీ చెప్పింది. ఒక్కత్తెవీ ఎందుకా పల్లెటూళ్లో ఉండడం అంటే రాఁవినాయుడెప్పుడూ “ఒచ్చేసి తన్తోనె ఉండిపొమ్మంటా”డనీ కానీ తానే రానని మెడ్డేస్తూ ఉంటాననీ అంది. “ఎందుకు బావూ ఆ వొయిజాగ్లో ఏటుంది. ఈడేమో అగ్గి పెట్టెలాంటి ప్లాటో అదేదో అందల ఉంతన్నాడు. పొద్దుగూకులా వెలట్రీ దీపాలెలిగించుకుని కూకుంతారు. గాలా? పాడా? అని అంది. ఈడి గోస పడ్నేక ఓ పాలెల్లి నాల్రోలు ఉండొచ్చినా బావూ. ఇరుగా? పొరుగా? మాటా? మంతా? సీ..అక్కడుంతేటి సుకం బావు, జైల్ల ఉన్నట్టుంటాది. నానుండ లేన్ర బావని చెప్పి తిరిగొచ్చీసిన. మరెప్పుడెల్లలే.. ఇదిగిప్పుడే ఒక్కత్తివీ ఊళ్లో ఉంతావు కల్లు కూడ సరిగ కా పడప్పోతే ఎలగుంతావని బైల్దేరదీసిండు. నాన్రాన్ర దేఁవుడా అని మొత్తుకున్న ఇన్లే. సర్లె పోనీ ఓ పాలి ఎల్లొచ్చెస్తే ఈడూ మనుసు కట్టపెట్టుకోడూ..ఆడి పిల్లల్నికూడ సూసొచ్చినట్టుగుంతాదని ఎల్తన్నాను బావు. నీనక్కడుండన్నే. తొందరగానే ఎలిపోయొచ్చెత్తాను. ఆడేటి సుకం. మనూర్లొ ఉంతె ఆల్లూ ఈల్లూ పలకరిత్తుంటారు. సోఁవులప్ప..సోఁవులప్ప అని గౌరవంగ సూసుకుంతారు. అయినా నా సంగతి నీకు తెల్సు కద బావు. కాల్నిలవదు ..నోరూర్కోదు...ఈదులన్నీ తిరుగుతుండాల..అడిగినోడికీ అడగనోడికీ సలాలు సెబ్తుండాల.. ఆల్లు ఇన్నీ ఇనకపోనీ..నాకుతోసిందేదో నాను సెబ్తుండాల. నాకు తెల్సుబావూ నా మాటెవ్వరిన్రని. నా పిల్లలే ఇన్రు. ఇదిగిదిగో ఈ మనవడు మాత్రం ఇంటాడు. నామీ ద కసింత గౌరవం, బెమా. ఇంకెవుల్లిన్రు. కాని సిన్నప్పటి కాణ్ణించి అలవాటైపోనాది గదా. ఇప్పుడు గమ్మునుండమంటే గమ్మున కూకోగల్నా? అయితొకటి బావు. అందరంతారు ఊలోల్ల సంగతులన్నీ నీకేల కిష్టా రాఁవా అనుకుంత పల్లక తిని తొంగోరాదా అని. కల్లెదురుగ్గ అన్నేయం జరుగుతుంతె అది నీకు అన్నేయమనిపించినప్పుడు ఆ మాట సెప్పడానికి బయ్యిఁవేల. ఓ పాలి మా యీదిల శివున్నాయుడు నేడా ఆడు పీకలమొయ్య తాగొచ్చి పెల్లాన్నిసితక బాదీసేడు బావు. అంతేన.. అవి బూతులు కావు బావు.. నానోటికి రావు... అసియ్యం అసియ్యం మాటలంటూ కొప్పట్టుకోని ఈదిలోకి తోస్సేడు బావు. ఆయమ్మి ఎసుమంటి మనిసో ఈదిలందరికి దెల్సు. అయ్నా అందరలాగ నిలబడిపోయి సినేమా జూసినట్టు సూస్తుండి పోనారు. ఒక్కల్లకి నోరు పెగల్లేదు. నాకు మాత్రం ఉండబట్టలేదు బావు. ఎల్లి జలగడిగీసేను. ఒక్కమాటంతె ఒక్కమాట మారు పలక్కుంత నాయుడు లోనికెల్లిపోయేడు బావు. ఆడకూతురికంత అన్నేయం జరూతుంతె పల్లకెలగుంతాము? నేన్సేసింది తప్పా? సెప్మి” అంది. నేను మాట్లాడే లోపే మళ్లాతనే.. “అయితింకోటుందిబావు. దరమ్ము నీకాడుంతె నువ్వు దెయిర్నంగ ముందు నిల్సుంతె నీ యెనకాలందరొస్తారు బావు.. మన సత్తిమే మన్ని కాస్ది. మొన్నీ మద్దిని అజారేవో ఎవురో గాని ఆ పెద్దమనిసి అయినీతి తుడిసి పెట్టాలని ముందు నిల్సుని యుద్దానికి రడీ యంతే అందరాయన ఎనకాలె నిలబడ్డారు కారా? దేనికైనా ముందు నిల్సునే మొగోల్లే కరువై పోయేరు బావు. మొగోల్లని నేనిలగంతన్ననని ఏఁవనుకోకు బావు. నేను సెప్పింది నిజిఁవా? అపద్దఁవా సెప్మి..సెప్మి..”అంది.
నేనేమనగల్ను? ఊరికొక్కరైనా సోఁవులప్పలాంటివాళ్లుండాలని కోరుకోవడం తప్ప.
అయినా అన్నాను “సోఁవులప్పా నీ మాటలెవరు వింటారని నువ్వు ఆనుకుంటున్నావుగానీ, నువ్వూ నీ కబుర్లూ నువ్వు చెప్పే తిత్తవలూ, సామెతలూ అన్నీ గౌర్నాయుడు పుస్తకం రాసి అచ్చేసిన సంగతి నీకు తెలుసా? ఎక్కడెక్కడున్నోళ్లో అవన్నీ చదివే ఉంటారు కదా” అన్నాను. “ఓ అదెప్పటిమాట. అవునో పుస్కరం అయి ఉంటది. గంటేడాల్ల బొట్టిడా పన్జేసి. నాకూ సెప్పినాడునే.
బొట్టిడంతన్నాననేటనుకోకు. సిన్నప్పటి కాణ్ణించి ఎరిగినోడుగదా. నాకంతె సాల సిన్నోడు. మావూల్లో మేష్ట్రు పని జేసీవోడు గాద. ఇప్పుడేదొ పెనసనుదీసుకుంట ఇదిగీ ఊల్లోనె ఉంతన్నాడని ఇన్నాను. నువుగాని కలిత్తె అడిగినానని సెప్మి..” అంది.. ఇంతలో రామినాయుడు డ్రింకులు తీసుకొని రావడంతో మా సంభాషణ అక్కడికాగింది. డ్రింకు తాగుతూ రామినాయుడడిగేడు. “ఏంటి సార్..మాముసిల్దాయి మీకు బోరుకొట్టిందా.. వాక్కుండా ఒక్క సిటం ఉండలేదు. అందుకనే ఊళ్లో అంతా కళింగోర..కళింగోర..అంటూ ఉంటారు” అన్నాడు. బోరేఁవిటి. అసలా కళింగోర మాటలు విందామనే ఇంత దూరమొచ్చింది. నాకోరిక నెరవేరింది. అదే చేప్పేను. ఇంతలో మాబావ వచ్చి వెళ్దామంటుంటే వాళ్ల ట్రైన్ కూడా వచ్చే సంకేతం అందింది. “మర్నేనుంతాను బావూ.. అందర్నీ అడిగేనని చెప్పు ముసిల్దాయిని మర్సిపోకండి” అంది. ఎలా మరచి పోగలను?
***
ఈ సోఁవులప్ప ఎవరని కదూ ప్రశ్న? ఈవిడ శ్రీ గంటేడ గౌరు నాయుడు రాసిన
“కళింగోర” పుస్తకం లోని కల్పిత పాత్ర. ఈ పుస్తకం డిశంబరు 1998 నుండి ఆగష్టు1999 మధ్యలో ఆంధ్ర ప్రభ దిన పత్రికలో “యాసపీఠం” శీర్షిక క్రింద వచ్చిన 64 ప్రాసంగిక వ్యాసాల సంపుటి. అక్షర జ్ఞానం లేని ఒక గ్రామీణ స్త్రీ పాత్రని సృష్టించి ఆమె నోటిద్వారా తాను చేయదల్చుకున్న సామాజిక వ్యాఖ్యల్ని సమర్థవంతంగా చేసిన గౌరునాయుడు అభినందనీయుడు.
ఉత్తరాంధ్ర పలుకుబడిలోని జవం జీవం తెలుసుకోవాలంటే అక్కడి సామెతల సౌరు తిలకించాలంటే శ్రీ గంటేడ గౌరు నాయుడు రాసిన కళింగోర పుస్తకాన్ని భాషాభిమానులందరూ తప్పని సరిగా చదవాలి. ఈ వుస్తకం ప్రచురింపబడి పుష్కరం దాటింది. అయినా బ్లాగుల పుణ్యమా అని ఇప్పటికైనా నలుగురికీ దీన్నిగురించి చెప్పే అవకాశం దొరికింది. ఈ పుస్తకాన్ని స్నేహ కళాసమితి నాయుడు వీధి కురుపాం.. 535524 వారు ప్రచురించేరు.
ఇంత మంచి పుస్తకాన్ని రాసినందుకూ, పది కాలాల పాటు తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే ఒక సోఁవులప్పని సృష్టించినందుకూ శ్రీ గౌరునాయుణ్ణి అభినందించకుండా ఉండలేకపోతున్నాను. (ఇంతకూ కళింగోర అంటే ఆప్రాంతంలో ఎప్పుడూ అరుస్తూ తిరిగే పిట్టట.)
సోఁవులప్ప ఓ కల్పిత పాత్ర అని మీకు చెప్పేసాక నేను ఆవిణ్ణి కలవడం ముచ్చట్లాడడం అన్నీ కల్పితమేనని వేరే చెప్పక్కర లేదు కదా.
తెలుగులో సాహిత్యంలోని ఒక పాత్ర (కన్యాశుల్కం లోని మధురవాణి) చేత తెలుగు నేలపై పుట్టి పెరిగి కవులై కీర్తిశేషులైన మహానుభావులని (విశ్వనాథ జాషువా మున్నగు వారిని) స్వర్గంలోఇంటర్వ్యూలు చేయించిన ఘనుడు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు. అదొక అద్భుతమైన ప్రయోగం. ఇదేమో సాహిత్యంలోని ఒక పాత్రతో రచయిత ముచ్చటించడం. ఇదీ ఒక ప్రయోగమే. నచ్చితే సంతోషం...సెలవు..